18 Jan 2010

'చమత్'ఖారాలు...

అనగనగా ఒక కవి గారు ... కవి గారు ఒక రోజు ఒకానొక రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. రాజుగారిని పొగిడిఅతనినుంచి బహుమానాలు అవీ పట్టుకుపోవాలని ఆశ. కాని రాజుగారిగురించి కవిగారికేమీ తెలియదు. ఐనా సరేనువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని ఏదో ఒకటి పొగిడి పనికానిచ్చేద్దామని అనుకున్నాడు. తీరా రాజాస్థానానికివెళ్ళినతరువాత కాని తెలియలేదు .. రాజుకి కన్ను ఒక్కటేనని ... ఒంటి కన్ను రాజుని ఏమని పొగడాలి ? ముందునుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది అతని స్థితి. అటువంటి పరిస్థితిలో క్రింది పద్యం స్ఫురించింది. చూడండి మరి రాజుని ఎలా పోగిడాడో.

అన్నాతిగూడహరుడవు
అన్నాతిని విడువ అసురగువువుగావే |
అన్నా తిరుమలరాయ !
కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే ||

దీని అర్థం ఏంటంటే ...
అన్నా తిరుమల రాయా ! = తిరుమలరాయ రాజా !
( అని, కవి గారు, సభలో కూర్చున్న రాజు గారి భార్యవైపు చూపిస్తూ ఇలా అన్నాడు ... )
అన్నాతిగూడ = + నాతి (స్త్రీ)+ కూడ ( తో కలిసియున్నచో ), హరుడవు ( = శివుడితో సమానం )
---> ఎందుకంటే శివునికి మూడు కళ్ళు ... రాజు తన భార్యతో కలిసివున్న వేళ ఇరువురికి కలిపి మూడు కళ్ళు ... కాబట్టి రాజా నీవు నీ భార్యతో కలిసివున్నప్పుడు పరమశివుడంతటి వాడవు ...

అన్నాతిని = + నాతిని ( స్త్రీ ని ), విడువ = విడచిపెట్టిన యడల , అసురగురువువుకావే = అసుర (రాక్షసుల) + గురువువుకావే ( గురువువే కదా )
---> రాక్షస గురువు శుక్రాచార్యునికి ఒకటే కన్ను. అందువల్ల తన భార్యనుండి విడివడిన యెడల రాజుకి ఒకటేకన్నవడం వలన శుక్రాచార్యునితో సమానం.

కన్నొక్కటి = కన్ను ఒక్కటి, కలదుకాని ( ఉందికాని, లేకపోతే ), కౌరవపతివే = ( కురువంశాధిపతియైన ధృతరాష్ట్రుడివే)
---> కన్ను ఒక్కటి నీకు ఉండిపోయింది కాని రాజా నీకు, అదికూడా లేకుంటే నీవు ధ్రుతరాష్ట్రుడంతటివాడివి సుమా !

విధంగా చమత్కారంతో కవి రాజుని మెప్పించి బహుమతులందుకొన్నాడు.


4 comments: