9 Dec 2010

ఆరెంజ్ - సినీ అనాలిసిస్
( ... ఇంకొంచెం ప్రేమించు )

మొత్తానికి నిన్న ఎలాగైతేనేం, ఆరెంజ్ సినిమా చూసేసాను. చూసిన తర్వాత ఎందుకో ఈ మూవీ మీద రివ్యూ లాంటిది రాద్దామని అనిపించింది. కాని, ఆలో'చించగా'  ఈ మూవీ కి రివ్యూ కాదు, అనాలిసిస్ రాయాలి అనిపించింది. ఎందుకంటే చాలామంది ఈ సినిమా చూసి 'కన్ఫ్యూషన్' లాంటి దానికి గురయ్యారు.

ముందుగా ముగ్గురిని మనం ఈ సినిమా తీసినందుకు అభినందించాలి ... ఒకటి భాస్కర్ - ఇటువంటి ఒక రిస్క్ తో కూడుకొని వున్న కథకి పకడ్బందీ గా స్క్రీన్ ప్లే రాసుకుని , దాన్ని అంతే చక్కగా తెరకి  ఎక్కించినందుకు ... రెండు ... చరణ్ - మగధీర తీసుకొచ్చిన మెగా మాస్ ఇమేజ్ ని మోస్తూ ఇంతటి సున్నితమైన మరియు రిస్క్ తో కూడుకొని వున్న లవ్ స్టోరీ ని నమ్మి అత్యద్భుతం గా నటించడం ... మూడు ... నాగబాబు - భాస్కర్ని, చరణ్ ని అంతకంటే ఎక్కువగా ఈ కథని నమ్మి ఈ సినిమా ని నిర్మించడం. అనాలిసిస్ లోకి వెళ్ళే ముందు, అసలు కథేంటి, ఎవరి పెర్ఫార్మెన్సెస్ ఎలా వున్నాయి అని త్వర త్వర గా ఒక సారి చెప్పేసుకుందాం.

కథేంటి? 
రామ్ (చరణ్) వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. అతనికి ఇంకా "గ్రాఫిటీ" అంటే ప్రాణం. ( ఈజీ గా అర్ధమయ్యేలా చెప్పాలంటే, గ్రాఫిటీ అంటే గోడలమీద పెయింట్ తో రక రకాల బొమ్మలు గీయడం ). జాను (జెనిలియా) ఒక బాయ్ ఫ్రెండ్ ని వెతుక్కొనే ప్రయత్నం లో వుండగా రామ్ పరిచయమవుతాడు, జాను ని చూడగానే మనసు పారేసుకుంటాడు. రామ్ కి జాను పరిచయమవ్వక మునుపు 9 లవ్ స్టోరీస్ (ఫెయిల్యూర్స్) వుంటాయి. ఏ ఇద్దరి మధ్య లవ్ కలకాలం ఒకేలా ఉండదని, అందుకనే ప్రేమ కొంత కాలం మాత్రమే బాగుంటుందని, తరువాత బోర్ కొడుతుందని, సో తను కొంతకాలం మాత్రమే ఎవరినైనా లవ్ చేస్తానని / చేయగలడని నమ్ముతాడు. ఎవరైనా ఒకరిని లైఫ్ లాంగ్ ప్రేమిస్తానని చెప్తే దానికి గారెంటి ఏమిటని ప్రశ్నిస్తాడు? ఎవరైనా తన లవర్ ని గాని పార్టనర్ ని గాని తనని లైఫ్ లాంగ్ లవ్ చేస్తారని నమ్మి ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేసుకుంటారు అని అడుగుతాడు. తాను ఒక గ్రేట్ లవర్ నని, తనకంతా గొప్పగా, నిజాయితీ గా, అబద్ధాలు చెప్పకుండా ఏ కుర్రాడూ ప్రేమించలేడని అనుకుంటాడు. జాను తనని ప్రేమిస్తోందని చెప్పినపుడు, తన ఐడియాలజీ గురించి, తన లవ్ ఫెయిల్యూర్స్ గురించి అంతా చెప్పి, తను కొంత కాలం మాత్రమే ప్రేమించగలనని చెప్తాడు. తనకి లైఫ్ లాంగ్ ప్రేమించాగలిగే వాడు కావాలని, కొంత కాలం మాత్రమే సాగే ప్రేమ తనకి అక్కర్లేదని చెప్తుంది. రామ్ తన ఐడియాలజీ కరెక్ట్ అని నమ్మించడానికి రక రకాల ప్రయత్నాలు చేస్తాడు.  జాను తనకు తెలిసిన అందరి లవర్స్ రిలేషన్ మీద, చివరికి తన తల్లిదండ్రుల మధ్య ప్రేమ పై కూడా సందేహ పడేలా తయారవుతుంది. కాని ఫైనల్ గా, తనని జీవితాంతం ప్రేమిచగలిగితేనే అది నిజమైన ప్రేమ అని నమ్మి, తనని ఇపుడు రామ్ ప్రేమించేటంత ప్రేమ తనకు జీవితాంతం కావాలని ఖరాఖండి గా చెపుతుంది. రామ్ కూడా జాను ని అంత తేలిగ్గా వదులుకోలేకపోతాడు. తన ఇంటిపక్కనుండే ఒక పెద్దమనిషికి ప్రేమ గురించి వున్న విశ్వాసం అతను మాట్లాడిన మాటలు రామ్ ని ప్రభావితం చేస్తాయి. సముద్రమంత ప్రేమని చూడాలంటే అది జీవితం చివరలోనే సాధ్యమని, అదీ కూడా ఒక్క మనిషిని అన్నాళ్ళు ప్రేమించాగాలిగితేనే నని అతనన్న మాటలు రామ్ ఆలోచనా విధానం లో మార్పు తీసుకువస్తాయి. లైఫ్ లాంగ్ ఎలా ప్రేమించాలో, తన లవర్ లో ఆ నమ్మకాన్ని ఎలా కలిగించాలో ఆలోచిస్తుంటాడు. తన దగ్గరున్న కొంచెం ప్రేమ ఐపోతే ఇంకొంచెం ప్రేమిస్తానని, అదీ ఐపోతే ఇంకొంచెం ప్రేమిస్తానని ... అలా ఇంకొంచెం ప్రేమిస్తూనే ఉండడానికి ట్రై చేస్తానని చెప్తాడు జాను తో.   రామ్ కిష్టమైన గ్రాఫిటీ ని వదిలేసి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ గా జాయిన్ అవమని జాను అడుగుతుంది. తనకోసం ఆ పని చేయమని నిలదీస్తుంది. జాను ఒక సెల్ఫిష్ అని, తన కోసం గ్రాఫిటీ ని వదులుకోలేనని, తనని ఇంక ప్రేమించలేనని చెప్పి వచ్చేస్తాడు. తన ప్రస్తుత అయిడియాలజీ కి కారణమైన తన టీనేజ్ లవ్ స్టోరీ ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పట్లో లవర్ కోసం తనను తాను కోల్పోవలసి వచ్చిందని, అందుకనే తనకి లాంగ్ లవ్ ల మీద సదభిప్రాయం లేదనీ చెప్తాడు. కాని చివరికి తను ప్రేమించే వారి ఆనందం కోసం  ఒక పని చేయడం, ఆ ప్రయత్నం లో తనని తాను మనస్పూర్తి గా వదులుకోవడం లో వున్న తృప్తి ని గ్రహిస్తాడు. తన ప్రేయసి కి లైఫ్ లాంగ్ ప్రేమ అని అందించగలననే నమ్మకాన్ని కలిగించగలననే విశ్వాసంతో  ఉత్సాహం గా ముందడుగేస్తాడు. అక్కడితో సినిమాకి తెర పడిపోతుంది.

పెర్ఫార్మెన్సెస్ :
భాస్కర్ పక్కా గా ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ ని అంతే పెర్ఫెక్ట్ గా తీసాడు. కథ, కథనం లో  కూడా ఎక్కడా కూడా టెంపో మిస్ అవకుండా చాలా బాగా పిక్చరైజ్ చేసాడు. సీన్ టు సీన్ అన్నీ లాజికల్ గా కనెక్ట్ అయ్యి వున్నాయి. పాటల్ని చాలా నీట్ గా, కథలో కలిసిపోయేలాగా చిత్రీకరించాడు. టోటల్ గా   మూవీ ఈజ్ వెరీ క్లీన్ అండ్ నీట్. జెనిలియా మొదటి 15 నిమిషాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ఆమె డైలాగ్స్ చాలా స్పీడ్ గా వుండి కొంత అయోమయానికి గురిచేస్తాయి. ఇంట్రడక్షన్ సీన్ లో మరీ ఎక్కువ చేసినట్టు కనపడుతుంది.కాని సినిమా సాగుతున్న కొద్దీ జెనిలియా తన స్థాయి పెర్ఫార్మెన్స్ ను చూపించింది. "యో యో గర్ల్స్" సీన్ లో సూపర్ గా చేసింది. పెర్ఫార్మన్స్ పరం గా జెనిలియా బాగా చేసినప్పటికీ, గ్లామర్ పరం గా జెనిలియా ఈ సినిమా కి మైనస్ అయింది. జెనిలియా లో మునుపటి సినిమాలలో వున్న చార్మ్ గాని, బబ్లీనెస్ గాని, అందం గాని ఎక్కడా కనపడలేదు. ముఖం లో కళ లేకుండా పాలిపోయినట్టు గా ఉంది సినిమా అంతా. జెనిలియా డ్రస్సింగ్ స్టైల్ గాని, హెయిర్ స్టైల్ కాని అంత ఇంప్రెస్సివ్ గా లేవు. బ్రహ్మానందం పాత్ర "పప్పీ" మొదలవడం కూడా అంత  ఇంప్రెస్సివ్ గా లేదు కాని, సినిమా లో కథ ముందుకు వెళ్ళే కొద్దీ "పప్పీ" పాత్ర హీరో క్యారెక్టర్ ని ప్రేక్షకులకి కనెక్ట్  చేసే కాటలిస్ట్ లాగ ఉపయోగ పడింది. బ్రహ్మానందం ఏ మాత్రం కష్టపడకుండా అలవోక గా చేసుకెళ్ళిపోగల పాత్ర ఇది. బ్రహ్మి ఖచ్చితమైన డైలాగ్ టైమింగ్ తో తన పాత్ర చక్కగా పండించాడు. "అష్టా చెమ్మా" ఫేం 'అవసరాల శ్రీనివాస్' ని అవసరానికి తగినంత వాడుకోలేకపోయారు.  'వెన్నెల కిషోర్' ని కూడా ఎక్కువ ఉయోగించుకున్నది లేదు. అతను చేసిన కొన్ని సీన్స్ బాగా చేసాడు. హీరోయిన్ తండ్రి గా చేసిన తమిళ హీరో "ప్రభు", హీరో పక్కింటి వ్యక్తి గా కనిపించి హీరో కి హితబోధ చేసే పాత్రలో నాగ బాబు , హీరో అక్క బావ గా వేసిన, నిజ జీవితంలోకూడా భార్యా భర్తలైన , మంజుల & సంజయ్, హీరో ఫ్రెండ్ లవర్ "మాయ" గా కనిపించిన "హ్యాపీ డేస్" అప్పు .. అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేసారు.   హారిస్ జయరాజ్ సంగీతం చాలా హాయి గా ఉంది. పాటలన్నీ కూడా కథ లో ఇమిడి పోయి కథనానికి సహకరించే విధం గా వున్నాయి. పాటల చిత్రీకరణ చాలా హాయిగొలిపే విధం గా ఉంది. పాటలు కూడా అనవసర రాద్ధంతపు రణగొణ ధ్వనులేమి లేకుండా, సాహిత్యం అర్ధమయ్యే విధంగా, మెలోడియస్ గా వున్నాయి. పాటలలో సాహిత్యం కూడా బాగుంది. అన్ని పాటలు కేవలం మేల్ వాయిస్ తో నే వుండడం గమనార్హం. కథా ఔచిత్యానికి తగినవిధంగానే పాటలు ఓన్లీ మేల్ వాయిస్ తో వున్నాయని సినిమా చూసాకా తెలుస్తుంది. (  "తొలిప్రేమ" సినిమా లో లాగా )

ఇంక చివరగా మరియు ముఖ్యం గా, చరణ్. ఈ సినిమా అవుట్ అండ్ అవుట్, కంప్లీట్ చరణ్'s  షో. ఎంతో సున్నితమైన స్టొరీ ఇది. హీరో పాత్ర ఏ మాత్రం ఎక్కువ తక్కువ చేసినా సినిమా లో ఫీల్ పాడై బాలన్సు పోతుంది. చరణ్ ఎంతో సటిల్డ్ పెర్ఫార్మన్స్ ను చూపించాడు. ఏ సీన్ లో దేనికి ఎంత ఎలా ఎక్స్.ప్రెషన్ ఇవ్వాలో పర్ఫెక్ట్ గా చేసి ప్రతీ సీన్ ని అద్భుతం గా పండించాడు. ఖచ్చితమైన టైమింగ్ తో సాధికారత తో డైలాగ్స్ ని పలికాడు. ఒక స్టార్ గా కాకుండా, తన ఇమేజ్ కి భిన్నమైన పాత్ర ను , కథను చేస్తూ, ఒక మంచి  ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకున్నాడు ఈ చిత్రం తో. పాటల్లో స్టెప్పులు చాలా హాయి గా , కొత్తగా వున్నాయి. కిందపడి, ఫిట్స్ రోగి గిల గిల కొట్టుకున్నట్టు కాకుండా, ఎక్స్ ప్రెషన్ బేస్డ్ గా చాలా నీట్ గా ఉంది డాన్సు అన్ని పాటల్లో. అన్నిటికంటే ముఖ్యం గా చరణ్ డ్రెస్సింగ్ గాని అప్పియరెన్స్ గాని సూపర్ గా వున్నాయి. జెనిలియా చరణ్ గ్లామర్ ముందు సరితూగలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే "చెర్రీ" ఈ సినిమా లో "ఆపిల్" లా వున్నాడు.

అనాలిసిస్:
ముందే చెప్పుకున్నట్టు గా, రామ్ కి లాంగ్ లవ్ మీద నమ్మకం వుండదు. లవ్ కొంత కాలం మాత్రమే బాగుంటుంది, ఆ  తరువాత బోర్ కొట్టటం స్టార్ట్ అవుతుంది .. ఆ టైం కి ఒకరికి ఒకరు టాటా చెప్పుకుని విడిపోవాలి అనే థియరీ చెపుతూ ఉంటాడు. ఇదే విషయం మీద తన అక్క బావలకి కూడా సలహా ఇస్తాడు, విడిపోమని ... రోజూ ఏదో ఒక గొడవతో కలిసి వుండడం కంటే విడిపోవడమే బెటర్ కదా అని సలహా కూడా పారేస్తాడు. షార్ట్ లవ్ అంటే, మన కారు హెడ్ లైట్ నమ్ముకుని రాత్రి  డ్రైవ్ చెయ్యడం లాంటిదని... అదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తామని ఎవరైనా అంటే .. అది  చీకట్లో మన హెడ్ లైట్ ఆర్పుకుని  ఎదుటి వాడు కారు హెడ్ లైట్ ఆధారం గా డ్రైవ్ చేయడం లాంటిదని ప్రాక్టికల్ గా జాను కి చూపిస్తాడు.

ఈ రకమైన మైండ్ సెట్ కి రామ్ కి వున్న ఒకానొక లవ్ ఫైల్యూర్ కారణమని చెప్పుకున్నాం కదా ఆల్రెడీ... ఆ స్టోరి లో రామ్ రూబ అన్న ఒక అమ్మాయి ని ప్రేమిస్తాడు ... పెద్దలు ఒప్పుకుని సరే అనే వరకు వెళుతుంది ఆ కథ. ... కాని కాలం గడిచేకొద్దీ .. రూబ తనకు సంబంధించిన ప్రతి విషయం లోను జోక్యం చేసుకుంటుంది ... తనని సంతోషపెట్టడం కోసం అబద్ధాలు చెప్పడం మొదలు పెడతాడు రామ్... దానివల్ల తనని తాను మెల్ల మెల్లగా కోల్పోతున్నానని గ్రహిస్తాడు .... రూబ ని జీవితాంతం అలా ప్రేరేమిస్తూ సంతోషం గా వుంచడం కోసం తను లైఫ్ లాంగ్ అలా అబద్ధాలు ఆడుతూ తనని తాను పూర్తిగా కోల్పోలేనని, అందువల్ల రూబ తో లవ్ ని కట్ చేసుకోవడానికి  నిర్ణయించుకుంటాడు. అలా చేసినతరువాత మళ్ళీ ఇదివరకటిలా సంతోషం గా ఉండగలుగుతాడు.

ఎప్పుడైతే లవ్ లో పొసెసివ్ నెస్ మొదలవుతుందో , అప్పుడు క్రమంగా లవ్ కరగడం మొదలై ఒకరి నుండి మరొకరికి ఎక్స్.పెక్టేషన్స్ పెరగడం మొదలవుతాయి. చికాకులు మొదలవుతాయి. ఎప్పుడైతే ప్రతీ లవ్ ఈ పాయింట్ కు చేరుకుందో, అప్పుడే ఆ లవ్ ని ఎండ్ చెయ్యాలి అనేది రామ్ ఫిలాసఫీ. ఇక్కడొక చిన్న విషయాన్ని గుర్తుతెచ్చుకోవాలి. వివేకానందుడు తన జీవితం లో ఒక సంఘటనను చెప్తూ ... లవ్ యొక్క గొప్పతనాన్ని వివరిస్తాడు ... ఒక సారి వివేకానందుని అతని స్నేహితురాలితో కలిసి ఒక చెరువు పక్కగా నడుస్తూ వుండగా, ఆ స్నేహితురాలు చెరువులోనుండి నీటిని తన దోసిలి లో తీసుకొని వివేకానందుడితో అంటుంది ... "చూడండి ... ఈ నీరు ఎంత స్వచ్ఛము గా మెరుస్తోందో...ఇదే ప్రేమంటే అని..." అప్పుడు  వివేకానందుడు ఇలా కొనసాగిస్తాడు ..."ఆ స్వచ్ఛమైన ప్రేమ అలా స్వేచ్ఛగా ఉంటేనే ఎప్పటికి నిలుస్తుంది ... ఎప్పుడైతే నువ్వు పిడికిలి బిగించాలని చూసావో ... అది నీ వేళ్ళ మధ్యన తను బయటపడగల మొట్టమొదటి ఖాళీ ని వెతుక్కొని ... జారిపోతుంది. అలాగే ఏ క్షణాన ఐతే నువ్వు నీ ప్రేమ ని బంధించి ఇది నాకు మాత్రమే సొంతం అని  అనుకోన్నావో .. అదే క్షణం ఆ ప్రేమ నీ నుంచి తప్పించుకుపోతుంది " అని. తిరిగి రామ్ ఫిలాసఫీ లోకి వస్తే ... ఎప్పుడైతే మనం పైన అనుకున్న పాయింట్ కి ఎప్పుడైతే ప్రేమ వచ్చిందో ... అప్పుడు విడిపోవడం బెటర్ .. అలా కాకుండా ... మనం జీవితాంతం ప్రేమిన్చుకుంటూనే వుంటాం అన్న భ్రమ లో బతకడం అనవసరం అని.

మరి ఇంత రీజనింగ్ వున్నప్పుడు మళ్లీ ఎందుకు జాను ప్రేమని వదులుకోలేక పోయాడు ? మనిషికి జీవితంలో ఎప్పుడూ రెండు చాయిస్ లు దొరుకుతుంటాయి. అలా దొరికిన ప్రతీసారి ... దేన్ని ఎంచుకుంటే మనం ఎక్కువ ఆనందం గా వుండగలమో తెలుసుకొని ఆ ఆప్షన్ వైపు మొగ్గు చూపుతాం. ఉదాహరణకి , T V  లో మంచి ప్రోగ్రాం వస్తోంది ... కాని రేపు పరిక్ష ఉంది ... చదువుకోవాలి ... ఏది ఎక్కువ ఆనంద దాయకమో దానిని ఎంచుకుంటాం ... కాని ప్రోగ్రాం చూద్దాం అని అనుకుని .. రేపు పరిక్ష బాగా రాయకపోతే ఏడవకూడదు ... ప్రేమ ఆనందాన్ని ఇస్తున్నంతసేపు దాన్ని ఎన్నుకున్నాడు .... ఎపుడైతే ఆనందం దొరకట్లేదో ... అప్పుడే నిర్దాక్షణ్యం గా వదిలేయాలి అనుకున్నాడు ... అదే చేసాడు ... ఎందుకంటే ... అక్కడ తనకు దొరకే ప్రేమకన్నా .. తను కోల్పోవలసింది ఎక్కువ కాబట్టి... వదిలేసిన ప్రతీసారి ... ఆనందం గానే వున్నాడు ... పరిక్ష రాసేముందు TV చూసిన పిల్లాడిలాగా ఏడవలేదు ... ఎప్పుడైతే జాను ప్రేమ తనకి తనకన్నా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని గ్రహించాడో ... ఆ క్షణమే జాను గురించి ఏమి వదులుకోవడానికైనా  సిద్ధపడ్డాడు. లైఫ్ లాంగ్ ప్రేమించినా తన దానివల్ల తను పొందే ప్రేమవల్లె ఎక్కువ ఆనందమని నిర్ణయించుకున్నాడు ...అటు వంటి   ప్రేమ వైపు అడుగేసాడు ...

మరి కన్ఫ్యూషన్ ఎక్కడ వచ్చింది? .... ఈ మూవీ ని చూసే వాళ్ళలో చాలామంది ఏదో ఒక పాయింట్ లో తమని తాము ఐడెన్టిఫై చేసుకుంటారు ... రామ్ కి వున్న క్లారిటీ వాళ్లకి వుండదు ... రామ్ ఆడించిన truth or dare గేమ్ లో తమని తాము ఊహించుకుంటే తెలిసొచ్చే నిజం  చేదు గా వుంటుంది ... ఎవడైనా మనగురించి నిజం  చెప్తే (మనకి నచ్చనిది) ముందు చిరాకొస్తుంది, తర్వాత కోపం వస్తుంది ... "యదార్ధ వాది లోక విరోధి" అన్న సామెత ఉండనే ఉందిగా ... సో ఫైనల్ గా సినిమా అంతా కన్ఫ్యూషన్ అని అనుకుని తృప్తి పడతారు ...

అంతా బాగానే తీసాడు కాని, భాస్కర్ ఓకే ఒక తప్పు చేసాడు.... ఈ సినిమా ని తెలుగులో కాకుండా ఏ తమిళ్ లోనో తీసుంటే బాగుండేది ... అక్కడ సూపర్ హిట్ అయ్యాకా చక్కగా తెలుగులోడబ్బింగ్  చేసుకుని , చొక్కాలు చింపుకుని మరీ సినిమా చూసి ... ఎంతో పెద్ద హిట్ చేసేవాళ్ళం కదా ....ప్చ్ ...  పూర్ ఫెలో !.... అనవసరం గా తెలుగు ప్రేక్షకుల్ని నమ్ముకున్నాడు ...