29 Mar 2010

మిస్టర్ ఎస్కేపిస్ట్

ఇవ్వాళ రాత్రి మా అమ్మ, నాన్న గారు, చెల్లెలు గౌతమి ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి సికిందరాబాదు నుంచి నిడదవోలు వెళ్ళవలసి వుంది. రాత్రి తొమ్మిదింపావు కి ట్రైన్. ఎనిమిది యాభైఐదు కల్లా స్టేషన్ కి వెళ్లి ఎస్ వన్ కంపార్ట్ మెంట్ లో మా వాళ్ళకి కేటాఇంచిన ఒకటి, మూడు, నాలుగు సీట్లలో (రెండు లోయర్ , ఒకటి అప్పర్ బెర్త్) కుర్చోపెడదామని బోగీ ఎక్కాను. మా అమ్మగారి వయసు యాభై ఐదు. పైగా స్థూలకాయం. దానికి తోడు నడుము మరియు మోకాళ్ళ నొప్పులు. అప్పర్ / మిడిల్ బెర్త్ లు ఎక్కలేరు. మా చెల్లెలు ఆరు నెలల ప్రెగ్నెంట్. తను కూడా పై బెర్త్ లు ఎక్కడం కష్టం అని ముందుగానే రిజర్వేషన్ దొరికినా రెండు లోయర్ బెర్త్ లు దొరక్కపోవడం వలన దానిని కాన్సిల్ చేసి తత్కాల్ లో మళ్ళీ రెండు రోజులముందే రిజర్వేషన్ చేఇంచాను.

బోగీ లోనికి ఎక్కేసరికి నాలుగవ నంబరు బెర్త్ లో ఒక పెద్దాయన కూర్చుని వున్నారు. మోకాలికి ఆపరేషన్ అయిందట ముందురోజే. కాలుకి బాండేజీ తో కూర్చుని వున్నారు. అయన భార్య కూడా ఆయనతో ప్రయాణిస్తోంది. ఆయనను ఎక్కించటానికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు మా కూపే అంతా ఆక్రమించుకుని వున్నారు. దాదాపు యాభై ఏళ్ళ వ్యక్తి, ఆయన భార్య, వారి  కుమారుడు, దాదాపు పాతికేళ్ళ పైన ఉంటాయి, ఆ ఆపరేషను ఐన పెద్దాయనను వారి భార్యను ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు. మొత్తానికి ఎలాగైతేనేం వారిని క్రిందకు దింపి మా సీట్లలో మావాళ్ళని కూర్చోపెట్టబోయా. రెండు లోయర్ బెర్త్ ఒక దానిపై కాలికి కట్టు తో వున్న పెద్దాయన వున్నాడు. మరొక బెర్త్ లో ఒకాయన విండో సీట్ వద్ద చక్కగా కూర్చుని మమ్మల్ని చూస్తున్నాడు. ఇంక నేను అది మాకు కేటాయించిన సీట్ అని ఆయన్ని తన సీట్లో కూర్చోమని చెప్పవలసి వచ్చింది. ఏదో ఆయన సొమ్మంతా మేము లాగేసుకుని వెళ్ళగొట్టినట్టుగా సణుక్కుని ఆయన లేచాడు. ముందు మా చెల్లెలిని అక్కడ విండో సీట్ లో కూర్చోపెట్టి సామానంతా సద్ది, మా అమ్మ నాన్న లను కూడా సీట్ లలో కూర్చోబెట్టి, రెండో లోయర్ బెర్త్ సంగతి గురించి ఆలోచించటం మొదలు పెట్టాను.

కాలుకి కట్టు తో వున్న పెద్దాయనను అడిగాను, వారిది ఏ బెర్త్ అని. మూడు, నాలుగు అని ఆయన టిక్కట్టు  చూపించాడు. ఇదెక్కడి గొడవరా బాబూ , మూడు నాలుగు మనవి కదా ... ఈయనవి  అని టిక్కట్టు లో ఉందేమిటి అని అనుకుంటూ బొగీ కి వున్న చార్ట్ చూసాను. మావాళ్ళ పేర్లే వున్నాయి. మళ్ళీ అయన టిక్కట్టు చూసాను. ఆయనది ఎస్ ఎల్ వన్ బోగీ. గార్డు బొగీ తో వుండే బొగీ అది. వికలాంగులకు కేటాఇంచే కోటా ఆ బొగీ లో వుంటుంది. ఆ విషయం తెలీక వారిని ఎక్కించడానికి వచ్చిన ముగ్గురు ఆయన్ని భార్య ని ఈ బొగీ లో (ఎస్ వన్ లో )ఎక్కించేసారు. ఇదీ విషయం అని వారిని ఎక్కించడానికి వచ్చిన వారికి చెప్పాను. ట్రైన్ కదలడానికి ఇంకా పది నిమిషాల పైన టైం వుంది, గార్డు ని టి సి ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఆ బొగీ లో ఎక్కించే ఏర్పాటు చేయమని చెప్పాను. ఆయనని మళ్ళీ కదల్చడం చాలా కష్టం అని అడ్జస్ట్ అవమని అన్నాడు, చాలా తేలికగా. అదెలా కుదురుతుంది, వారు ఆక్యుపై చేసుకున్న బెర్త్ కి బదులు వేరొకరిది చూపించమని, లేదా ఎవరినైనా ఇద్దరినీ ఆ బొగీ కి వెళ్ళమని రిక్వెస్ట్ చేయమని చెప్పాను. మా అమ్మగారు చెల్లెళ్ళు వెళ్ళే స్థితిలో లేరు, మా నాన్న గారు వెళ్ళని ఇక్కడ వదిలి వెళ్ళడం కష్టం, ఎందుకంటే తెల్లవార ఝామునే నాలుగున్నరకి ట్రైన్ దిగాలి, లగేజి కూడా చాలా వుంది. నేను వుండి వుంటే నేనైనా కనీసం వెళ్ళే వాడిని. నేను వీళ్ళని ఎక్కించడానికి మాత్రమె వచ్చాను ఏదో ఒకటి చేయమని చెప్పాను.

సైడ్ లోయర్ బెర్త్ అడిగి అడ్జస్ట్ చేస్తానని, కొంచెం సేపు ఆగమని అడిగాడు. ఇంతలో ఇందాకా విండో సీట్ దగ్గరనుండి సణుక్కుంటూ వెళ్ళిన వ్యక్తి, అది పోలీసులదని వాళ్ళు ఇవ్వరని చెప్పాడు. పైగా ట్రైన్ కదలితే వాళ్ళే సద్దుకుంటారని, ఎవరో ఒకరు బెర్త్ అడ్జస్ట్ చేసుకుంటారని ఉచిత సలహా పడేసాడు. సరే ఐతే, ఆ లోయర్ బెర్త్ బదులు కనీసం మిడిల్ బెర్త్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అది ఐన ఇప్పించమని వాళ్ళతో వచ్చిన యువకుడికి చెప్పాను. వాళ్ళు ఎవరూ రాలేదని, రాగానే అలాగా అడుగుతానని కొంచెం విసుగ్గా అన్నాడు. ఇంతలో, ఇందాకా ఉచిత సలహా పడేసినాయన, మిడిల్ , అప్పర్ లు  నా బెర్త్ లు , నేనెందుకు ఇస్తాను అనిచెప్పి చక్కా పోయాడు. ఈ గొడవ జరుగుతుండగా వీళ్ళని ఎక్కించడానికి వచ్చిన ముగ్గురిలో, ఆ యువకుడి తండ్రి జారుకున్నాడు. ఆయన మొదట్లో మమ్మల్ని సద్దుకోమని సర్దిచెప్పబోయాడు. అది కుదిరే వ్యవహారం కాదని మెల్లగా అక్కడినుండి తప్పించుకున్నాడు. ఆ యువకుడికి తను అక్కడ బుక్ అయిపోయాను అని చాలా బాధగా ఉంది. ఏదైనా తొందరగా చేయండి, ఎవరినైనా రిక్వెస్ట్ చేయండి అని నేను తొందర చేసాను. అటుగా వచ్చిన పోలీసులని సైడ్ బెర్త్ ఇమ్మని అడిగాడు. పోలీసులు ససేమిరా అని నా కళ్ళముందే అన్నారు. కాని పోలీసులు ఆ బెర్త్ ఇస్తానన్నారని నన్ను మభ్యపెట్టచూసాడు. ఎవరినైనా ఇద్దరినీ ఆ బొగీ లోకి వెళ్ళమని రిక్వెస్ట్ చేయమని మళ్ళీ ఈ సారి గట్టిగా చెప్పాను. నా మీద కోపం ప్రదర్శించాడు ఆ యువకుడు. తానేమీ చెయ్యలేనని, వాళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారని అన్నట్టు గా చాలా విసురుగా సమాధానం చెప్పాడు. పైగా కొంచెం టైం పడుతుంది , ట్రైన్ కదలనివ్వండి, అడ్జస్ట్ చేస్తాను అని అన్నాడు. ఐతే అతను కూడా వారితో వస్తున్నాడా అని అడిగాను. తను రావట్లేదట. నాలాగే తన వాళ్ళని రైలు ఎక్కించడానికి వచ్చాడట. మరైతే ట్రైన్ కదిలాక ఎలా సెటిల్ చేస్తావ్ అని స్వరం పెంచి అడిగాను. ఇంక విధి లేనట్లుగా ఇద్దరు ముగ్గురుని అడిగి కాదనిపించుకొని, వచ్చి చెప్పాడు. ఎవరూ వెళ్ళడానికి వోప్పుకోవట్లేదని. ఇంతలో ఆ యువకుడి తల్లి కిందనుంచి అరుస్తోంది... "బుజ్జీ నువ్వు ట్రైన్ దిగై ... కడులుతుందేమో .... వాళ్ళు చూసుకుంటారులే (??!!)" అని. అప్పటికి కూడా ఆ యువకుడికి మళ్ళీ చెప్పడానికి ట్రై చేసాను. గార్డుకి, టి సి కి చెప్పి వీల్ చైర్ తెప్పించి వాళ్ళ బొగీ లో కూర్చోపెట్టి రమ్మని, రిక్వెస్ట్ చేస్తే ట్రైన్ కొన్ని నిమిషాలు ఆపుతారని, నేను కూడా హెల్ప్ చేస్తానని చెప్పి చూసాను. నా మాట పట్టించుకోకుండా అటూ ఇటూ తిరుగుతూ ట్రైన్ కదిలే వరకు కాల యాపన చేసాడు. టి సి కి చెపితే ఆయన కూడా తీసుకెళ్ళి ఆయనకు కేటాయించిన బొగీ లో కూర్చోపెట్టమనే సలహా ఇచ్చాడు. చివరికి అటూ ఇటూ తిరుగుతూనే ట్రైన్ కదిలే వరకూ కాలయాపన చేసాడు. ఇంక చివరగా నేనేమీ చేసేదిలేక, టి సి కి కంప్లైంట్ చేయమని , మన బెర్త్ లు మనకి కావాలని ఆయనతో చెప్పమని, అది ఆయన పరిష్కరిచవలసిన విషయమని మా నాన్న గారికి చెప్పి వీడ్కోలు చెపుతూ భారం గా బయటకు వచ్చాను. ఇంతలో ఎవరో ఒక పేద్ద ఫ్యామిలీ , దాదాపు పది మంది దాకా వుంటారు. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి బండి కదిలే సమయానికి వచ్చారు. వారు వచ్చే సమయానికి గార్డు పెట్టె వాళ్ళని దాటుతోంది. గట్టిగా కేకలు పెట్టారు. బండి ఆగింది. వారు వారి బొగీ ల్లోకి ఎక్కాక మళ్ళీ కదిలింది.

ఏదైనా విపత్కర పరిస్తితి వస్తే మనకి ఎంత ఇబ్బందిగా వున్న సద్దుకుంటాం. అవతలివారికి సహాయ పడతాం. కాని అవతలివారికి మనలని ఇబ్బంది పెట్టవలసిన ఆవశ్యకత లేకపోయినా, వారి అలసత్వం వల్ల చేసిన తప్పిదాలవల్ల మనలని ఇబ్బంది పెడుతూ సద్దుకోమని ఉచిత సలహా పడేయటం ఎంతవరకు సమంజసం? నిజానికి ట్రైన్ ఎక్కినా పెద్దాయనను చూస్తె మానవీయ కోణంలో మనం సహాయ పడవలసిందే. నేను ఆ ట్రైన్ లో ప్రయాణిస్తుంటే కనీసం నేనైనా సద్దుకునేవాడిని. కాని ప్రెగ్నెంట్ అయిన నా చెల్లెలిని, పెద్ద వాళ్లైన నా తల్లి తండ్రులను నేను సద్దుకోమని చెప్పలేను. వాళ్ళని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు కూడా. వేరొక బెర్త్ అదే బొగీ లో ఎక్కడో ఒకచోట వుంటే ఎలాగో ఆయాసపడి సద్దుకోవచ్చు. అసలు బెర్త్ లేకుండా మన బెర్త్ వేరొకరికి ఇచ్చి, వారికి వెళ్ళే అవకాశం వుండికూడా వారితో వచ్చిన వాళ్ళు తప్పించుకొని తిరిగి ఎస్కేపిస్ట్ ల లా ప్రవర్తిస్తే ఏమి చేసేది. పైగా తన సీట్ కాకుండా పక్క సీట్ ని ఆక్యుపై చేసుకుని కూర్చుని, లేవమంటే బాధపడే వ్యక్తి   కూడా ఉచిత సలహాలు ఇస్తూ, తనదాకా వచ్చేసరికి తప్పించుకున్నాడు.

ఒకటి వచ్చిన వ్యక్తులు తాము చేయవలసిన పనిని సక్రమంగా చేయలేదు. రెండు చేసిన తప్పును గుర్తించలేదు. మూడు వారి పొరపాటును చెప్పినప్పుడు దానిని సరిచేసుకోవడానికి ప్రయత్నించకుండా అవతలివారిని సద్దుకోవాలని చాలా విశాల హృదయం తో సలహా పారేశారు. నాలుగు , అసలు అవతలి వారి సాధక బాధకాలు ఏమిటి, వారికి సద్దుకునే అవకాశం ఉందా, సద్దుకునే పరిస్తితి ఉందా, వారికి ఇబ్బందిని కలిగిస్తున్నామా అన్న చింతన లేనే లేదు. ఐదవది, అసలైనది ... తాము చేసిన వెధవ పనికి తమ వాళ్ళు కూడా సఫర్ అవ్వాలన్న ఇంగిత జ్ఞానం ఏ మాత్రం ఏ కోశానా లేదు, కనపడలేదు. ఎప్పుడు ట్రైన్ కదులుతుందా, ఈ గొడవ వదులుతుందా, తప్పించుకుని పారి పోదామా అనే తప్ప. పెద్ద వయసు గల తండ్రి సరే, బాధ్యతా యుతం గా ఉండవలసిన ఆ యువకుడుకూడా చాలా అసహనం గా, ఎస్కేపిస్ట్ లా ప్రవర్తించాడు. మన దేశం మంచి దేశం గా కీర్తి సంపాదించడానికి దేశం లో పౌరులు, యువతీ యువకులు, దేశ విదేశాలకు పోయి భారత దేశ కీర్తి పతాకని ఎగురవేయవలసిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు కనీసం భాద్యతాయుతమైన పౌరునిగా ప్రవర్తించి, తనకు ఎదురైన సవాళ్ళను అధిగమించి తానెదుర్కొన్న సమస్యలను పరిష్కరించుకొనగలిగితేచాలు ... ఎంతో మందికి ఎన్నో దేశాల వారికి మనం మార్గ దర్శకులమవుతామనడంలో అతిశయోక్తి లేదు.

నాకు ఇవ్వాళ తారసపడిన ఎస్కేపిస్ట్ ల లాగానే చాలామంది వున్నారు. వారందరికీ నా సందేశం ఒక్కటే . Get Well Soon Mr Escapist !!!!. ఇంకెందుకాలస్యం. మీరుకూడా మీ కామెంట్ లో మీ సందేశాని జత చేసి పోస్ట్ చేయండి.

                           ఇక ఉంటా మరి ... ఇప్పటికే అర్థరాత్రి దాటింది ...
                                                            బాలు

p.s. ఇప్పుడే అందిన వార్త. ట్రైన్ లో ఆ పెద్దాయన వాళ్ళు అక్కడ కూర్చోకూడదని టి సి కూడా గట్టిగా చెప్పాడట. ఆయన ఎలాగూ పడుకోలేదు. కూర్చోవడమే కాబట్టి రెండు బెర్త్ లమధ్య ఖాళి స్థలం లో పక్క వేసి కూర్చోవడానికి మా నాన్న గారు మరొకరు కలిసి ఏర్పాటు చేసారట. ఆయన బెర్త్ కంటే ఆ ఏర్పాటే సుఖంగా వుందని హాయి గా కూర్చున్నాడట. ఆ పెద్దావిడ, మా అమ్మ గారు చెల్లెలు రెండు లోయర్ బెర్త్ లలో రొటేషన్ పద్ధతిమీద సద్దుకుని పడుకున్నారట. హమ్మయ్య ... అందరూ సౌఖ్యమే .... ఎస్కేపిస్ట్ లు తప్ప.