9 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (8,9)

నేటి శ్లోకాలు గీతలో ఎనిమిది మరియు తొమ్మిదవ శ్లోకాలు 


భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః |
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తి స్తథైవ చ ||


యుద్ధమునందు ఎల్లప్పుడూ విజయము సాధించు మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని తనయుడైన భూరిశ్రవుడు వంటివారు మనసైన్యమందున్నారు.


అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః |
నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ||


నా కొరకు తమ జీవితములను త్యాగము చేయుటకు సిద్ధపడియున్న వీరులు ఇంకను పలువురు కలరు. వారందరూ పలువిధములైన ఆయుధములను దాల్చిన వారును మరియు యుద్ధ నిపుణత కలిగిన వారునూ అయి వున్నారు. 


పాపియైన దుర్యోధనుని పక్షము వహించియున్నందున , దుర్యోధనుడు పైన పేర్కొన్న వీరులందరునూ కురుక్షేత్ర యుద్ధములో మరణించి తీరతారు అని ముందే నిర్ణయింపబడివుంది. కాని దుర్యోధనుడు మాత్రం పైన తెలుపబడిన సంఘటిత శక్తి వల్ల తనకు విజయము తప్పక లభించునని ధైర్యముతో ఉన్నాడు. 


మరలా కొత్త శ్లోకంతో పునర్దర్శనం రేపు ...సెలవు ...

7 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (6,7)

నేటి శ్లోకాలు గీతలో ఆరు మరియు ఏడవది ....


యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ |
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||


పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి ఐన ఉత్తమౌజుడు, సుభద్రా తనయుడు, ద్రౌపదికుమారులును అందున్నారు. ఈ వీరులందరు మహారథులు.

అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ |
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ||

కాని ఓ బ్రాహ్మణోత్తమా ! నా సేనా బలమును నడుపుటకై ప్రత్యేకముగా యోగ్యులైనట్టి నాయకులనుగుర్చి మీ కొరకు నేను తెలియచేసెదను.  

ఈ విధముగా దుర్యోధనుడు పాండవ సేనల బలాబలాలను ఏకరవు పెట్టిన తదుపరి , వారిని ఎదుర్కోవడానికి తమ సేనలలో ఉన్న వీరుల గురించి ద్రోణునికి వివరించడానికి పూనుకొన్నాడు.

2 Feb 2010

కామెంట్ ప్లీజ్ ..... (1)

[ చూడగానే విలక్షణం గా కనిపించే ఫొటోలకి, రెండు లైన్లలో మీ కామెంట్ ని రాయండి ... ఫోటో ను జత చేస్తూ నేనొక రెండు లైన్ల కామెంట్ తో మొదలు పెడతాను .. ]


ఇదిగో నా కామెంట్ ... :-)
బూరెబుగ్గల బుజ్జాయి ...
ఎందుకా అచ్చెరువోయి ....

నవ్వేజనాః సుఖినోభవంతు .... (1)


ఎవరు గొప్ప ?


అనగనగా...ఒకచోట  ప్రపంచంలో ఎవరు గొప్ప పోలీసులో తెలుసుకొనేందుకు ఒక పోటీ నిర్వహిస్తున్నారు. అమెరికా పోలీసులు, రష్యా పోలీసులు, స్కాట్లాండ్ యార్డు పోలీసులు ఇంకా మనవాళ్ళ మధ్యన ఆ పోటీ. ఒక చిరుతపులిని దట్టమైన అడవులలోకి వదిలిపెడతారు. దాన్ని ఎవరైతే తక్కువ టైం లో వెతికి తీసుకువస్తారో వారే విజేతలు. 


మొదటగా అమెరికా పోలీసులు వెళ్ళారు. ఒక గంటలో చిరుతను వెనక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత రష్యా వాళ్ళు 40 నిమిషాలలోనే ఆ పనిని చేసి అమెరికన్లను చూసి కాలరెగరేసారు. ఆ తర్వాత వెళ్ళిన  స్కాట్లాండ్ యార్డు పోలీసులు అరగంట లోనే చిరుతని వెనక్కి తీసుకొచ్చి రష్యన్ల వేపు పరిహాసంగా చూసారు. 


ఇక తరవాత వంతు మన వాళ్ళది. స్కాట్లాండ్ యార్డు పోలీసుల కంటే తొందరగా మన వాళ్ళు చిరుతని వెతికి తీసుకొస్తారా లేదా అని అందరూ ఉత్కంటతతో ఎదురు చూస్తున్నారు. పదిహేను నిమిషాలు గడిచాయి ..... ఇరవై నిమిషాలు గడిచాయి .... అరగంట కూడా ఐపోయింది .... మనవాళ్ళ జాడ ఎక్కడా లేదు .... గంట గడిచింది ... రెండు గంటలైంది .... ఎక్కడా అలికిడి లేదు ... ఏమైందో చూద్దామని మిగిలిన వాళ్ళందరూ అడవిలోకి వెళ్లి వెతకసాగారు. 


వెతకగా వెతకగా .. మనవాళ్ళు ఒకచోట కనబడ్డారు. అక్కడొక ఎలుగుబంటి చెట్టుకి కట్టేసివుంది. మనవాళ్ళందరూ దాని చుట్టూచేరి కర్రలు పట్టుకుని చితకబాదుతూ ఇలా అరుస్తున్నారు ... "ఒప్పుకో .... నువ్వే చిరుతపులివని ఒప్పుకో .... ఒప్పుకుంటావా లేదా ... " !!??

1 Feb 2010

ప్రతి దినం ... గీతావందనం ... (5)

నేటి శ్లోకం గీత లో  ఐదవది .....

ధృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ |
పురుజిత్  కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||


ధృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతీభోజుడు, శైబ్యుడు వంటి నరోత్తములైన మహా యోధులున్నారు.


దుర్యోధనుడు గొప్ప రాజనీతి నిపుణుడని ఇదివరకే చెప్పుకున్నాం. యుద్ధము ఆరంభమయ్యే ముందు తన శత్రుసైన్య బలాబలాలను అంచనా వేస్తూ, గురువు సేనాధిపతియైన ద్రోణునికి హెచ్చరిక చేస్తున్నాడు.