15 Apr 2009

త్యాగ భారతీయం

మన భారత దేశం యోగ భూమి, తపో భూమి మరియు త్యాగ భూమి. భారతీయులమైన మనమందరం నిస్వార్ధపరులం, దైవ, తాత్విక చింతన మరియు స్వాతంత్ర్య భావాలు అధికంగా కలవారం. రెండు వంద ఏళ్ల పరాయి పాలనను కాదని, పోరాడి తెల్లవారిని దేశం నుంచి వెళ్ళగొట్టాం. గత అరవై సంవత్సరాలుగా మన దేశ నాయకులు పలు సార్లు మన ముందుకొచ్చి వోటు తో మనలను పాలించే పాలకులు గా ఎన్నుకోమని కోరుకున్నప్పుడల్లా రక రకాలైన తీర్పులతోఆశ్చర్యపరిచాం. రాచరికపు వ్యవస్థ అంతరించినా వంశ పారంపర్య పాలనను కొన్ని సార్లు గెలిపించాం. అత్యవసర కాలపు నిరంకుశ ఇనుప పాదాలకింద నలిగి, విసిగి, వేసారి జనాల పార్టీని గెలిపించాం. కొన్ని సార్లు సానుభూతి చూపించి కొందరిని గెలిపించాం, ఇంకొన్నిసార్లు సానుభూతి మాత్రమే చూపించాం. జై శ్రీరాం అన్నవాళ్ళను గెలిపించాం, అంతలోనే రాం రాం చెప్పి ఇంటికీ పంపించాం. మధ్య కాలంలో కలగూరగంపలను కూడా గెలిపించాం, విలువలను తుంగ లో తొక్కే నాయకులను నెత్తిన పెట్టుకున్నాం. మళ్ళీ అటువంటి తీర్పు ఇవ్వడానికి మరోసారి సిద్ధపడుతున్నాం. ఎంతో మేధో సంపత్తిని కలిగిన మనం విధమైన తీర్పులు ఇవ్వవలసిరావడం వెనుక ఏదో ఒకబలమైన కారణం వుండే వుంటుంది. ఏమిటది ?


నకర్మణా నప్రజయా ధనేన, త్యాగేనైకే అమృతత్వమానశుః

పైన ఇవ్వబడిన శృతి వాక్యం యొక్క అర్ధము " (నకర్మణా) సత్కర్మలు అనగా మంచి పనుల చేత కాని, (నప్రజయా) సంతానం లేదా కుటుంబం వలన కాని, (ధనేన) ధనము వలన కాని సాధించడానికి వీలుకాని అమృతత్వము ( లేదా మోక్షము ), కేవలము త్యాగము వలన మాత్రమే సాధ్యమగును". ప్రజాస్వామ్య నిర్వచనం (లేదా నిర్ణయం) ప్రకారం, మనలో చాలామందికి పై అర్ధం బాగా వంటబట్టిందని అర్ధం చేసుకోవాలి. ఎందుకంటే, ఇప్పటిదాకా మనం వెలువరించినప్రజాస్వామిక తీర్పులలో స్వాతంత్ర్య భావన అంతర్లీనంగా ఉన్న మన త్యాగ భావమే ఎక్కువ కనిపిస్తుంది. రెండువందలఏళ్ల పరాయి పాలనను తరిమి కొట్టినా, సొంత వాళ్ల పాలన మీద అస్పష్టమైన తీర్పునిచ్చినా అది పాలకుల తీరు నచ్చకకాదు లేదా వారి పాలన నచ్చక కాదు. మనలను మరొకరు పాలించడమనే భావనే మనకు నచ్చక. పరాయి వారు కనకతెల్ల దొరలని చెప్పి వారిని దేశం నుండి తరిమేసాం. కాని సొంతవారిని అలా చేయలేం కదా! అందుకని పరిపాలిచే సమర్ధతఉన్నవారిని మనం ఆదరించం, ఆదరించినా గెలిపించం, గెలిపించినా పరిపాలించే అవకాశాన్నివ్వం, పరిపాలించే అవకాశంఇచ్చినా మంచి చేసే సమయాన్ని ప్రోత్సాహాన్ని అసలివ్వం.

మనం మన త్యాగ బుద్ధిని చూపిస్తాం. మనలను దోచుకునే అవకాశాన్ని ఇస్తాం. నిలువు దోపిడీ చేస్తున్నా కిక్కురుమనం. మన నెత్తిన అడుగులు వేస్తూ వెళ్లేవారి చేతులు పట్టుకుని సహాయం చేస్తున్నాభరిస్తూ ఊరుకుంటాం. విదిలించిన ఎంగిలిమెతుకుల్ని మహా ప్రసాదంగా భావిస్తాం. ఇంకా మనం నిస్వార్ధ జీవులం. కష్టపడి పనిచేసి పది రూపాయలుసంపాదించడం నేర్పిస్తామన్న వాళ్ళని దరికి కూడా రానీయం. ఒక రూపాయి అడుక్కోవడం నేర్పించే వాళ్ళని నెత్తినపెట్టుకుంటాం. పేదరికాన్ని తరిమేసాం, తరిమేస్తున్నాం, తరిమేస్తూనే ఉంటాం అన్న వాళ్లకు జయహో అంటాం. చట్టసభలలో ఎవరు బాగా బూతులు తిట్టుకొని సమయాన్ని వృధా చేస్తారో వాళ్ళని మాత్రమే జాగ్రత్తగా ఎన్నుకుంటాం. ఇవన్నీ కేవలం మనలని మరొకరు పాలించడం ఇష్టం లేక మాత్రమే. స్వతంత్ర భావనతో మాత్రమే.

మన ఇష్టం వచ్చింది మనం చేస్తాం. పట్టించుకోని వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాం. పట్టించుకున్న వాళ్ళని వెలి వేస్తాం. హెల్మెట్ పెట్టుకోం, ట్రాఫిక్ రూల్స్ మనకనవసరం, క్యూ లలో నుంచోం, వుద్యోగాలు కొనుక్కుంటాం, లంచాలుపుచ్చుకొంటాం, కళ్ళతో నవ్వుతాం, నొసటితో వెక్కిరిస్తాం, మన బాక్సులు మనమే బద్దలుచేసుకుంటాం, అంతా మనఇష్టం . మనకు నచ్చినట్లు చేస్తాం. ప్రజాస్వామ్య బద్ధంగా మన మరియు రాబోయే తరాల బంగారు భవిష్యత్తును త్యాగంచేస్తున్నాం. జయహో త్యాగ భారతీయం ! జయజయహో త్యాగ భారతీయం !!