30 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (3)

నేటి శ్లోకం గీత లో  మూడవది .....

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యుఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||

ఓ ఆచార్యా ! బుద్ధికుశలుడు, మీ శిష్యుడు ఐన ద్రుపదపుత్రునిచే  వ్యుహముగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనా సమూహమును చూడుము. 

రాజ నీతి నిపుణుడైన దుర్యోధనుడు, బ్రాహ్మణుడు మరియు సైన్యాధిపతియగు ద్రోణాచార్యుని తప్పిదములను ఆధారముగా చేసుకొని రెచ్చగొట్టతలచుకొన్నాడు. అందువలనే ద్రుపదునికి ద్రోణునికి కల రాజకీయ వైరాన్ని గుర్తుచేసే విధంగా ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుని సైనిక వ్యూహము చే గొప్పగా ఉన్న పాండుపుత్రుల సేనలను చూడమనెను. ద్రోణున్ని గెలిచే పుత్రుడిని ద్రుపదుడు యజ్ఞమాచరించి పొంది, ఆ పుత్రుడిని ద్రోణునివద్దకే యుద్ధవిద్యలను నేర్చుకొనుటకు పంపగా, విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా ద్రోణుడతనికి యుద్ధ సూక్ష్మములను బోధించెను. ఇప్పుడా ధ్రుష్టద్యుమ్నుడే పాండవ పక్షము చేరి సైన్య వ్యూహములు సైతం రచించెను.  కనుక ద్రోణుడు రాజీ లేని ధోరణితో యుద్ధమాచరింపవలెనన్న ఉద్దేశముతో దుర్యోధనుడు ఆ విధముగా ద్రోణుని తప్పిదమును ఎత్తిచూపెను. 

No comments:

Post a Comment