31 Jan 2010

చిన్న కథ ... (1)

[ ఈ కథలు నేను విన్న, చదివిన మనసుకు హత్తుకున్న చిన్ని చిన్ని కథలు. మీ అందరితో పంచుకోవాలని ఇక్కడ  పొందుపరస్తున్నాను. ఇమేవీ నా సొంతం కాదని మనవి ]

త్యాగం :

ఏమీ ఆశించకుండా ప్రేమించడం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఇది. ఇక చదవండి .....


పదేళ్ళ జాన్ తన చెల్లెలితో ఆడుకుంటూ ఉండగా. ఆ పాప పడిపోయి తలకు పెద్ద గాయం తగిలి చాలా రక్తం పోయింది. జాన్ ది తన చెల్లెలి గ్రూప్ రక్తమే. 

"నువ్వు నీ చెల్లెలికోసం కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు జాన్ ని. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు సరే అన్నాడు. ఆ కుర్రవాడి సంశయాన్ని డాక్టర్ మరోలా అర్థం చేసుకున్నాడు. " పెద్ద నొప్పిగా ఉండదు. ఐదు నిమిషాల్లో అయిపోతుంది "అని చెప్పాడు. 

తన శరీరంలోంచి రక్తం మెల్లమెల్లగా సీసా లోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గరకు  వచ్చి "లే చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు .. " ఇంకా ఎంతసేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్" అని. 

డాక్టర్ విభ్రాంతుడై, " రక్తం ఇస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నావా?" అని అడిగాడు.... దానికా కుర్రవాడు "అవును" అన్నాడు.

డాక్టర్ గొంతు వణికింది.... "అనుకునే ఇచ్చావా?" అన్నాడు కంపిస్తూ. 
అవును అన్నట్లు తలూపాడు జాన్, అమాయకంగా... 

***********************************

ప్రతి దినం ... గీతావందనం ... (4)

నేటి శ్లోకం గీత లో  నాల్గవది .....

అత్ర శూరా మహేశ్వాసా భీమార్జున సమాయుధి |
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||

ఈ పాండుపుత్రుల సైన్యమందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధరులు పెక్కురు గలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగువారు అటువంటి మహా యోధులు. 

యుద్ధవిద్య యందు ద్రోణాచార్యుడి గొప్ప శక్తిముందు ధృష్టద్యుమ్నుడు అవరోధము కానప్పటికీ, దుర్యోధనుని భయమునకు కారకులైన వారు చాలామంది ఉన్నారు. వారిలో ప్రతిఒక్కరు కూడా భీముడు మరియు అర్జునుని వలె నిరోధింపశక్యము కానివారగుటయే ఆతని భయమునకు కారణము. భీమార్జునుల శక్తి దుర్యోధనునికి తెలిసియుండుట చేతనే ఇతరులను వారిరువురితో పోల్చెను.

30 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (3)

నేటి శ్లోకం గీత లో  మూడవది .....

పశ్యైతాం పాండుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ |
వ్యుఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||

ఓ ఆచార్యా ! బుద్ధికుశలుడు, మీ శిష్యుడు ఐన ద్రుపదపుత్రునిచే  వ్యుహముగా ఏర్పాటు చేయబడిన పాండుపుత్రుల యొక్క గొప్ప సేనా సమూహమును చూడుము. 

రాజ నీతి నిపుణుడైన దుర్యోధనుడు, బ్రాహ్మణుడు మరియు సైన్యాధిపతియగు ద్రోణాచార్యుని తప్పిదములను ఆధారముగా చేసుకొని రెచ్చగొట్టతలచుకొన్నాడు. అందువలనే ద్రుపదునికి ద్రోణునికి కల రాజకీయ వైరాన్ని గుర్తుచేసే విధంగా ద్రుపద పుత్రుడైన ధృష్టద్యుమ్నుని సైనిక వ్యూహము చే గొప్పగా ఉన్న పాండుపుత్రుల సేనలను చూడమనెను. ద్రోణున్ని గెలిచే పుత్రుడిని ద్రుపదుడు యజ్ఞమాచరించి పొంది, ఆ పుత్రుడిని ద్రోణునివద్దకే యుద్ధవిద్యలను నేర్చుకొనుటకు పంపగా, విశాల హృదయము కలిగిన బ్రాహ్మణునిగా ద్రోణుడతనికి యుద్ధ సూక్ష్మములను బోధించెను. ఇప్పుడా ధ్రుష్టద్యుమ్నుడే పాండవ పక్షము చేరి సైన్య వ్యూహములు సైతం రచించెను.  కనుక ద్రోణుడు రాజీ లేని ధోరణితో యుద్ధమాచరింపవలెనన్న ఉద్దేశముతో దుర్యోధనుడు ఆ విధముగా ద్రోణుని తప్పిదమును ఎత్తిచూపెను. 

29 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (2)

నేటి శ్లోకం గీత లో రెండవది .....

సంజయ ఉవాచ --
దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !
ఆచార్యముప సంగమ్య రాజావచనమబ్రవీత్ ||

ధృతరాష్ట్రుని ప్రశ్న విని సంజయుడు ఈ విధముగా పలికెను : పాండవులచే వ్యుహముగా ఏర్పడిన బలగాలను చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు సమీపించి ఈ విధముగా పలుకుచుండెను.

అంధుడైన ధృతరాష్ట్రునికి బాహ్య దృష్టితో పాటు, ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధార్మిక విషయాలలో తన పుత్రులుకూడా తనతో సమానమైన ఆంధులని అతనికి తెలుసు. కాని కురుక్షేత్ర స్థల ప్రభావమువల్ల పాండవులతో రాజీకి ఏమైనా సిద్ధపడుతున్నారా అన్న సందేహముతో యుద్ధరంగమందు పరిస్థితిని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడని అర్ధంచేసుకున్న సంజయుడు రాజుని ఉత్సాహపరచే ఉద్దేశముతో, అక్కడ రాజీ వంటిది ఏదీ జరగటం లేదని, పాండవ సేనను చూసిన తదుపరి సేనాధిపతియైన గురువు ద్రోణునితో మాట్లాదతలచి దుర్యోధనుడు అతని చెంతకు వెళ్ళాడని ధృతరాష్ట్రునికి తెలియచేసాడు. 
 పాండవసేనలను చూసి పరిస్థితి యొక్క తీవ్రతను అర్ధం చేసుకొన్నవాడై , రాజైనప్పటికినీ దుర్యోధనుడు స్వయముగా సైన్యాధిపతి చెంతకు వెళ్ళవలసి వచ్చెను. ఈ సంఘటన దుర్యోధనుని రాజనీతిజ్ఞతను తెలుపుతూనే పాండవ సేనా వ్యూహము చుసినపిమ్మట అతనికి కలిగిన భయమునుకూడా బహిర్గతపరుచుచున్నది.

పునర్దర్శనం మరలా రేపు... సెలవు ...

28 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (1)

ప్రతి దినం ఒక గీతా శ్లోకం, దాని అర్ధం మరియు సంగ్రహం గా దాని వివరణ చెప్పుకుందాం .... 
నేటి శ్లోకం .... ( గీత లో మొట్ట మొదటి శ్లోకం తో మొదలు పెడుతున్నాము )

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః|
మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సంజయ ||

[ సంజయుడు వ్యాస మహర్షి శిష్యుడు. వ్యాసుని కరుణతో తానున్న ప్రదేశము నుండియే కురుక్షేత్ర యుద్ధమును చూడగలిగెను. కనుకనే ధృతరాష్ట్రుడు సంజయునిని ఈ విధముగా అడుగుచుండెను ]

ఓ సంజయా ! ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమందు నా తనయులు మరియు పాండురాజు తనయులు యుద్ధము చేయగోరి సమకూడిన పిమ్మట ఏమి చేసిరి ?

ధృతరాష్ట్రుడు ఈ విధముగా అడుగుట లో ఒక ప్రాముఖ్యత వుంది. యుద్ధము జరుగు ప్రదేశము దేవతలకు సైతం పూజనీయ స్థానమైన కురుక్షేత్రం. స్వభావరీత్యా ధర్మాత్ములైన పాండవులకు ఆ కురుక్షేత్ర స్థల ప్రభావము అనుకూలముగా ఉంటుందని  అతనికి తెలుసు. అందువలన తన పుత్రులైన కౌరవుల యొక్క విజయావకాశాములపై అతనికి గొప్ప సందేహం ఉంది. అటువంటి సందేహముతోనే ధృతరాష్ట్రుడు సంజయుడిని " వారు ఏమి చేసిరి ?" అని ప్రశ్నిస్తున్నాడు. అధర్మ పరాయణులైన వ్యక్తులకు తాము ఆచరించే పనులయందు విజయముపై ఎంత సందేహాస్పదులుగా ఉంటారో భగవద్గీత మొట్టమొదటి శ్లోకం మనకు తెలియచేస్తున్నది.

రేపు మరియొక శ్లోకంతో మీ ముందుంటాను... సెలవు.

18 Jan 2010

'చమత్'ఖారాలు...

అనగనగా ఒక కవి గారు ... కవి గారు ఒక రోజు ఒకానొక రాజుగారి ఆస్థానానికి వచ్చాడు. రాజుగారిని పొగిడిఅతనినుంచి బహుమానాలు అవీ పట్టుకుపోవాలని ఆశ. కాని రాజుగారిగురించి కవిగారికేమీ తెలియదు. ఐనా సరేనువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని ఏదో ఒకటి పొగిడి పనికానిచ్చేద్దామని అనుకున్నాడు. తీరా రాజాస్థానానికివెళ్ళినతరువాత కాని తెలియలేదు .. రాజుకి కన్ను ఒక్కటేనని ... ఒంటి కన్ను రాజుని ఏమని పొగడాలి ? ముందునుయ్యి వెనుక గొయ్యి లా తయారైంది అతని స్థితి. అటువంటి పరిస్థితిలో క్రింది పద్యం స్ఫురించింది. చూడండి మరి రాజుని ఎలా పోగిడాడో.

అన్నాతిగూడహరుడవు
అన్నాతిని విడువ అసురగువువుగావే |
అన్నా తిరుమలరాయ !
కన్నొక్కటి కలదుగాని కౌరవపతివే ||

దీని అర్థం ఏంటంటే ...
అన్నా తిరుమల రాయా ! = తిరుమలరాయ రాజా !
( అని, కవి గారు, సభలో కూర్చున్న రాజు గారి భార్యవైపు చూపిస్తూ ఇలా అన్నాడు ... )
అన్నాతిగూడ = + నాతి (స్త్రీ)+ కూడ ( తో కలిసియున్నచో ), హరుడవు ( = శివుడితో సమానం )
---> ఎందుకంటే శివునికి మూడు కళ్ళు ... రాజు తన భార్యతో కలిసివున్న వేళ ఇరువురికి కలిపి మూడు కళ్ళు ... కాబట్టి రాజా నీవు నీ భార్యతో కలిసివున్నప్పుడు పరమశివుడంతటి వాడవు ...

అన్నాతిని = + నాతిని ( స్త్రీ ని ), విడువ = విడచిపెట్టిన యడల , అసురగురువువుకావే = అసుర (రాక్షసుల) + గురువువుకావే ( గురువువే కదా )
---> రాక్షస గురువు శుక్రాచార్యునికి ఒకటే కన్ను. అందువల్ల తన భార్యనుండి విడివడిన యెడల రాజుకి ఒకటేకన్నవడం వలన శుక్రాచార్యునితో సమానం.

కన్నొక్కటి = కన్ను ఒక్కటి, కలదుకాని ( ఉందికాని, లేకపోతే ), కౌరవపతివే = ( కురువంశాధిపతియైన ధృతరాష్ట్రుడివే)
---> కన్ను ఒక్కటి నీకు ఉండిపోయింది కాని రాజా నీకు, అదికూడా లేకుంటే నీవు ధ్రుతరాష్ట్రుడంతటివాడివి సుమా !

విధంగా చమత్కారంతో కవి రాజుని మెప్పించి బహుమతులందుకొన్నాడు.


10 Jan 2010

5 Nice Little Stories ....

1.
Once, all villagers decided to pray for rain, on the day of prayer all the


people gathered but only one boy came with an umbrella...

THAT'S FAITH


2.
When you throw a baby in the air, she laughs because she knows you will


catch her...

THAT'S TRUST


3.
Every night we go to bed, without any assurance of being alive the next

morning but still we set the alarms in our watch to wake up...

THAT'S HOPE

4.
We plan big things for tomorrow in spite of zero knowledge of the future

or having any certainty of uncertainties...

THAT'S CONFIDENCE

5.
We see the world suffering. We know there is every possibility of same or

similar things happening to us. But still we get married??...

THAT'S OVER CONFIDENCE!!

ఇండియా - ది సాఫ్ట్ పవర్

ఇండియా యొక్క సాఫ్ట్ పవర్ గురించి శశి థరూర్ గారి అద్భుత ప్రసంగం. తప్పకుండా చూడండి.

నా పదం ....

ప్రతి విఫలమొక యత్నం
ప్రతి విజయమొక యజ్ఞం
విఫలమైన ప్రతి యత్నం
విజయానికి సోపానం
ఓటమినే ఎరుగకుంటే
ఏల తెలియు విజయ సౌఖ్యం

-------------------------------------

వాలు జడలతో ఓర చూపుతో
మదిని నువ్వే
కలత రేపావు ....
కలత రేపి
కనుల పడక
ఎక్కడెక్కడ దాగి ఉన్నావు ....

--------------------------------------

చిరుదివ్వెల వెలుగుల్లో
సిరిమువ్వల మధురిమలు...
నీ బంగరు వదనం లో
చిరునవ్వుల గలగలలు ....

----------------------------------------

పరుగెడుతూ పరుగెడుతూ
చీకటిలో అడుగిడుతూ
అమవసనిసి వెన్నెలకై
నలుదిక్కుల కనిపెడుతూ
స్వప్నప్రియ విరహిణి కై
వెతుకుతున్న స్వాప్నికుడా
నులివెచ్చని తొలి తూరుపు
కిరణాలను అనుభవింప
తొందరగా తొందరగా
తొందరగా మేలుకో
మేలుకుని వేచివున్న
విజయాలను చేరుకో

------------------------------------


నిను చూసిన కన్నులకి
మాట రాదు వర్ణింపగా
స్పందించిన హృదయానికి
భాష రాదు రచిఇంపగా
పలుకరాదు అధరాలకు
నిను పొగిడే మాట లేక
కదలరావు నా పదములు
నిను చేరే దారిలేక ...

----------------------------------