29 Jan 2010

ప్రతి దినం ... గీతావందనం ... (2)

నేటి శ్లోకం గీత లో రెండవది .....

సంజయ ఉవాచ --
దృష్ట్వాతు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా !
ఆచార్యముప సంగమ్య రాజావచనమబ్రవీత్ ||

ధృతరాష్ట్రుని ప్రశ్న విని సంజయుడు ఈ విధముగా పలికెను : పాండవులచే వ్యుహముగా ఏర్పడిన బలగాలను చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు సమీపించి ఈ విధముగా పలుకుచుండెను.

అంధుడైన ధృతరాష్ట్రునికి బాహ్య దృష్టితో పాటు, ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధార్మిక విషయాలలో తన పుత్రులుకూడా తనతో సమానమైన ఆంధులని అతనికి తెలుసు. కాని కురుక్షేత్ర స్థల ప్రభావమువల్ల పాండవులతో రాజీకి ఏమైనా సిద్ధపడుతున్నారా అన్న సందేహముతో యుద్ధరంగమందు పరిస్థితిని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడని అర్ధంచేసుకున్న సంజయుడు రాజుని ఉత్సాహపరచే ఉద్దేశముతో, అక్కడ రాజీ వంటిది ఏదీ జరగటం లేదని, పాండవ సేనను చూసిన తదుపరి సేనాధిపతియైన గురువు ద్రోణునితో మాట్లాదతలచి దుర్యోధనుడు అతని చెంతకు వెళ్ళాడని ధృతరాష్ట్రునికి తెలియచేసాడు. 
 పాండవసేనలను చూసి పరిస్థితి యొక్క తీవ్రతను అర్ధం చేసుకొన్నవాడై , రాజైనప్పటికినీ దుర్యోధనుడు స్వయముగా సైన్యాధిపతి చెంతకు వెళ్ళవలసి వచ్చెను. ఈ సంఘటన దుర్యోధనుని రాజనీతిజ్ఞతను తెలుపుతూనే పాండవ సేనా వ్యూహము చుసినపిమ్మట అతనికి కలిగిన భయమునుకూడా బహిర్గతపరుచుచున్నది.

పునర్దర్శనం మరలా రేపు... సెలవు ...

No comments:

Post a Comment