21 Nov 2010

5 Why అనాలిసిస్

ఏ విషయమైనా మనకి పరాయి దేశం వాడెవడైనా చెపితే అందరం ఎగేసుకుంటూ అదో పేద్ద Management lesson లాగ ఫీలై తు.చ తప్పకుండా అమలుచేసేస్తాం. ఇది మనవాళ్ళు ఎప్పుడో చెప్పార్రా నాయనా అంటే వినిపించుకోం, సరికదా ఇంకా కావలసినంత వెటకారం చేస్తాం,  "మన వేదాల్లో అన్నీ ఉన్నాయష !" అనే "కన్యాశుల్కం" డైలాగ్  ను గుర్తుతెచ్చుకుని మరీ.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, మొన్న ఈ మధ్యన ఆఫీసులో ఏవో Management విషయాలు చెప్తూ ఈ 5 Why అనాలిసిస్ గురించి, అబ్బో తెగ చెప్పారులెండి. ఈ టెక్నిక్ సమస్యల మూల కారణం (root cause)  కనుక్కోవడానికి వాడే ఒక పద్ధతని, దీన్ని కనిపెట్టింది జపాను దేశస్తుడని, ప్రముఖ కార్ల తయారీ సంస్థ Toyota ఈ టెక్నిక్ ని మొట్టమొదట గా అనుసరించి లాభ పడిందనిన్ని. ఏదైనా ఒక సమస్య మూల కారణాన్ని తెలుసుకోవాలంటే, ఐదు సార్లు "ఎందుకు?" (why?) అని ప్రశ్నించుకోవాలట  .మరిన్ని వివరాలకు ఈ వికిపీడియా లింక్ ను సందర్శించండి : http://en.wikipedia.org/wiki/5_Whys

దీని గురించి వినగానే, నాకు చిన్నప్పుడు విన్న ఒక కథ జ్ఞాపకం వచ్చింది. నేను విన్న, నాకు గుర్తున్న మొట్టమొదటి కథ అది. బహుశా అందరికి అంతేనేమో. ఆ కథ మరేదో కాదు, ఏడు చేపల కథ. మరిచిపోతే గుర్తు చేసుకోవడం కోసం మళ్లీ ఆ కథ ని ఈ క్రింద రాస్తున్నాను.

అనగనగా రాజుకి ఏడుగురు కొడుకులు. ఆ ఏడుగురు ఒకరోజు వేటకు వెళ్లి ఏడు చేపలను తీసుకొచ్చి ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకు ఎండలేదు? అని అడిగితే, గడ్డి అడ్డొచ్చింది అని చెప్తుంది. గడ్డి గడ్డి ఎందుకు అడ్డు వచ్చావ్? అని అడిగితే, ఆవు నన్ను మేయలేదు అని చెప్తుంది. ఆవు ఆవు ఎందుకు మేయలేదు? అని అడిగితే, కాపరి నన్ను గడ్డి మేయటానికి వదలలేదు అని చెప్తుంది. కాపరి కాపరి ఆవుని ఎందుకు వదలలేదు? అంటే, నన్ను చీమ కుట్టింది అని చెప్తాడు. చివరికి చీమని , చీమ చీమ ఎందుకు కుట్టావ్? అని అడిగితే, "నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా?" అని చక్కా చెప్పి జారుకుంటుంది. సో, రాజుగారబ్బాయిలు తెచ్చిన ఏడవ  చేప ఎండక పోవడానికి కారణం, పశుల కాపరి చీమ పుట్టలో వేలుపెట్టడం అన్నమాట.

సరిగ్గా లెక్కపెడితే, పైన కథ లో కూడా కర్రెక్ట్ గా ఐదు "ఎందుకు?" లు వుంటాయి. అంటే ఈ 5 వై అనాలిసిస్ లు ఈ రాజు గారి కథలు మనకి ఎప్పటివంటారు?  ఇటువంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలు మన పెద్దలు ఏనాడో ఏర్చి కూర్చి చిన్న చిన్న కథల రూపంలోనూ, ఆచార వ్యవహారాల రూపంలోనూ పొందు పరచి గోరుముద్దల వయసునుంచే మనకు అందించారు. పెద్ద  పెద్ద పేర్లు పెట్టకుండానే మన బుర్రల్లోకి సూటిగా దూరిపోయే  విధంగా ఆలోచించారు. ఇవ్వాళ ఎంత మంది పిల్లలకు ఆ సనాతన వారసత్వ సంపదను కానుకగా అందివ్వగల్గుతున్నాం? ఇవ్వాళ పిల్లలు "నాన్నా చేప అంటే ఏమిటి?" అని అడిగితే, "చేప అంటే Fish కన్నా" అని చెప్పుకునే దౌర్భాగ్య స్థితిలో వున్నాం. ఒక పెద్ద బాల శిక్షలేదు, సుమతి వేమన శతకాలు లేవు, పంచతంత్ర కథలు తెలియవు, చందమామ కథలు లేవు, ఒక పద్యం లేదు, పాట లేదు. తెలుగు అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్ , పద్యం అంటే పాత చింతకాయ పచ్చడి, హనుమాన్, గణేశ అంటే కార్టూన్ లో పాత్రలు ఇవ్వాళ రేపు చిన్నారులకి. పుస్తకాలు కథలు చదివి మానసిక వికాసం పొందాల్సిన వయసులో, కార్టూన్ల పేరిట ప్రపంచం లో ఉన్న చెత్తనంతా పిల్లలకు అందివ్వగలుగుతున్నాం  ఇవ్వాళ."Harry Potter" అంటూ పిల్లా పెద్దా అందరూ ఊగిపోతూ చదివేస్తున్నారు, సినిమా చూసేస్తున్నారు మరి వారిలో ఎవరికైనా "సహస్ర శిరచ్చేద అపూర్వ చింతామణి" కథ లోని రుచి తెలుసా? ఎప్పుడైనా ఈ పేరు వినివుంటారా?

వికాసం సాధించవలసిన వయసులో పిల్లలకి నానా చెత్తని అందించి, మన చందమామ కథల్ని చిన్న చిన్న విషయాలను పశ్చిమ దేశాలనుండో, ఈశాన్య దేశాలనుండో ఎవడో వచ్చి షుగర్ కోటింగ్ లాంటి ఇంగ్లిషు పలుకులతో మనకి ఉపదేశిస్తే ... ఆహా ఎంత గోప్ప విషయాన్ని కనుగొని సెలవిచ్చారు? అని వాళ్ళని వేనోళ్ళ పొగుడుతూ వాళ్ళకి దాసోహమంటూ ఎంత గొప్ప ప్రగతిపథంలో దూసుకుపోతున్నాం మనం... గ్లోబలైజేషన్ నేపథ్యం లో ప్రపంచం లో అన్ని రకాల సంస్కృతులు, సాంప్రదాయాలు, రచనలు, భావనలు మనకు అందుబాటులోకి వచ్చేసాయి. అవన్నీ దూరంపెట్టమని అనటం లేదు. కాని వాటి ప్రభావానికి లోనై మనల్ని మనం మరచిపోకూడదు.

1 comment: